Sasanalu (Epigraphy) (Study material for TSPSC Groups Examinations only )
రచనా విధానంలో చారిత్రకులు ఆధారపడే ఆకారాల్లో ప్రధానమైనవి శాసనాలు.
ఇవి ఆయా కాలాల్లోని రాజకీయ, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, మత విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడతాయి. శాసనం అనేది ప్రాచీనకాలంనుండి
ఉంది. ”శాస్యతే అనేన శాసనం” అనేది క్రమంగా రాజాజ్ఞ అనే అర్థంలో స్థిరపడింది. అన్ని
శాస్త్రాల అధ్యయనాలకు వివిధ పేర్లు ఉన్నట్లే శిలలపైన, రాగిరేకులపైన లిఖించబడ్డ అక్షరాలను చదివి వాటిని విశ్లేషించే
శాస్త్రాన్ని ”శాసన శాస్త్రం” (ఎపిగ్రఫి) అంటారు. ఈ శాసన శాస్త్రాన్ని అధ్యయనం
చేయడం అంత సులభమేమీ కాదు.
1914లో యాజ్దాని డైరెక్టర్‌గా నిజాం ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ను
ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2 డిసెంబర్, 1964లో రాష్ట్ర
ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో శాసన శాఖను ప్రత్యేకంగా వేరు చేసి
స్వతంత్రతను కల్పించింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామ గ్రామాలకు వెళ్ళి సర్వే
నిర్వహించి, అక్కడ లభించే శిలా, తామ్రశాసనాలను సేకరించడం. సేకరించిన వాటిని పరిష్కరించి ప్రచురించడం.
ఈ సర్వే నిర్వహిస్తున్న సమయంలో పురావస్తుశాఖ ఆయా రాజవంశాలకు చెందిన 7,478 శాసన ప్రతిబింబాలను సేకరించింది. వీటిలో 2,795 తెలంగాణ జిల్లాలకు సంబంధించినవి. ఇవి తెలంగాణ చరిత్రను నిర్మించడంలో
ముఖ్య ఆధారాలుగా ఉన్నాయి. సేకరించిన శాసనాలను జిల్లాల వారిగా విభజించి ఐదు
సంపుటాలను ప్రచురించింది. అవి 1. వరంగల్, 2. కరీంనగర్, 3. నల్లగొండ, 4. మెదక్, 5. మహబూబ్‌నగర్.
ఇంకా నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సర్వే పూర్తయింది. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా సర్వే కావలసి ఉంది. ఇది ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రగతి. 1915-16 నుండి 2011-2012 వరకు ఆర్కియాలజీ
శాఖ ఆధ్వర్యంలో మొత్తం 66 సార్లు పురావస్తు శాఖ త్రవ్వకాలు
జరిగినాయి. ఇన్ని సంవత్సరాల్లో వీరికి బహత్‌శిలా యుగం, నవీన శిలాయుగం, పూర్వ చారిత్రక
యుగం, మధ్యయుగం నాటి కాలాల అవశేషాలు, శాసనాలు, దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు
లభించాయి.
1979-83 మధ్యకాలంలో కరీంనగర్, కోటిలింగాలలో జరిపిన త్రవ్వకాల్లో పూర్వ శాతవాహన, శాతవాహనుల కాలాలకు సంబంధించిన అనేక చారిత్రక, సాంస్కృతిక అవశేషాలు బయల్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి
విడివడ్డాక తెలంగాణ తన చారిత్రక మూలాల అన్వేషణలో భాగంగా ముందుకు సాగుతుంది. ఈ
ప్రయత్నంలో ఆర్కియాలజీ శాఖ, పలువురు వ్యక్తులు తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు.
2016-17లో జరిపిన తవ్వకాలలో పురావస్తుశాఖ సిద్ధిపేట జిల్లాలో పాలమాకుల, నర్మెట్ట గ్రామాల్లో బృహత్‌శిలాయుగం నాటి అవశేషాలు వెలుగులోకి
వచ్చాయి.
అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని పజ్జూరు, ఫణిగిరి గ్రామాల్లో పురావస్తుశాఖ త్రవ్వకాలు నిర్వహించింది.
ఫణిగిరిలో చేసిన పరిశోధనల్లో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బయటపడిన
మహాస్తూప వివరాలను అంచనా వేసి అది ఒక పారిభోగిక స్తూపంగా నిర్ణయించారు. పారిభోగిక
స్తూపం అంటే బౌద్ధ సన్యాసుల వ్యక్తిగత వస్తువులు ఉన్నటువంటి, స్తూపంగా చెప్తారు. బౌద్ధ సన్యాసులు, భిక్షువులు ఈ ప్రాంతంలో అధికంగా ఉండేవారు. తెలంగాణాలో లభించిన మొదటి
పారిభోగిక స్తూపంగా దీన్ని భావిస్తున్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతులను
వెలికి తీసి విస్తృతస్థాయిలో మహోత్కృష్టమైన ఇక్కడి చరిత్రను అందరికీ తెలియజేయాలనే
ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆర్కియాలజీ & మ్యూజియమ్స్ శాఖ కృషి చేస్తుంది. ఈ క్రమంలో అనేక ఇతర సంస్థలు, వ్యక్తులతో కలిసి భవిష్యత్ కార్యా చరణ, ప్రాజెక్టులను రూపొందిస్తుంది. దీనివల్ల ఆయా సంస్థల సహకారంతో ఎంతో
ఘనకీర్తి కలిగిన తెలంగాణ ప్రాంత చరిత్ర వెలుగులోకి వస్తుంది. పరిశోధక బృందంలోని
నిపుణులైన శాసనకారులు, పరిశోధక విద్యార్థులు తమ వంతు
ప్రయత్నంగా అనేక త్రవ్వకాలు జరిపి అక్కడ లభించిన శాసనాలు, చారిత్రక అవశేషాలను ఎప్పటికప్పుడు పత్రికాముఖంగా ప్రకటిస్తున్నారు.
తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఈవిధమైన పరిశోధనలు పరిశీలనలు జరుగుతున్నాయి.
పురావస్తుశాఖ ఇపట్పికే వివిధ జిల్లాలకు చెందిన 2,795 శాసన ప్రతిబింబాలను విభజించుకుంది. దీని ద్వారా చారిత్రక తెలంగాణను
పునర్ నిర్మించుకోవచ్చు. ఇప్పటివరకు 47 పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు ఎపిగ్రాఫికల్
సీరిస్ క్రింద ప్రచురించారు. ఇందులో వ్యక్తిగత శాసనాలు, కార్పస్ శాసనాలు, వార్షిక నివేదికలు, జిల్లాలవారి సంపుటాలు ఉన్నాయి.
తెలంగాణాలో శాసనాల పట్ల అవ గాహనతో, ఆసక్తితో శాసనాలను చదివిన మొదటి వ్యక్తి మద్రాసు ప్రెసిడెన్సీలో
పనిచేసిన ప్లీట్. ఇతడు మద్రాసు నుండి ఈ ప్రాంతానికి వచ్చి హన్మకొండ శాసనాన్ని 1891లో చదివినాడు.
ఆ తరువాత మానవల్లి రామకృష్ణ కవి 1890- 1910 ప్రాంతంలో వనపర్తి రాజా ఆస్థానంలో ఉండి మహబూబ్‌నగర్ శాసనాలను
సేకరించినారు.
1916-1918 ప్రాంతంలో శేషాద్రి రమణకవులు నల్లగొండ, వరంగల్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అనేక శాసనాలను సేకరించారు.
వీరి కృషి తెలంగాణ చరిత్రకు ఆయువుపట్టు.
1)కంభంపాటి అప్పన్నశాస్త్రి వేయిస్తంభాల గుడి శాసనాన్ని అధ్యయనం చేసి 70 పుటల గ్రంథాన్ని వెలువరించారు.
2)తెలంగాణాలో కొమర్రాజు లక్ష్మణరాయ పరిశోధక సంస్థ ద్వారా కొమర్రాజు
‘తెలంగాణ శాసనాలు’ రెండు సంపుటాలుగా 1930, 32లలో వెలువరించారు.
స్టేట్ ఆర్కియాలజీ ఆధ్వర్యంలో ”కార్పస్ ఇన్స్‌స్క్రిప్షన్స్ ఆఫ్
తెలంగాణ” 4 సంపుటాలు వెలువడ్డాయి. మొదటి మూడు
సంపుటాలకు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు ఎడిటర్‌గా వ్యవహరించగా, 4వ సంపుటం మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆధ్వర్యంలో వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ & మ్యూజి యమ్స్ ఏర్పడింది. ఈ శాఖలో శాసన పరిశోధన ప్రత్యేక విభాగం
ఏర్పడి పరిశోధనలు నిర్వహించి పుస్తకాలు ప్రచురించింది.
1)ఉపాసికాయ బుద్ధ రక్షిషాయ దానం (వర్ధమానుకోట)
తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు వెలుగుచూసిన శాసనాల్లో మొదటగా
శాతవాహనుల సిముఖుని నాణేలు, వాటిపై ఉండే లిపి మొదటిగా
పేర్కొంటున్నారు.
1) మొదటి సంస్కృత
శాసనం విష్ణుకుండిన గోవిందవర్మ ఇంద్రపాలనగర శాసనం
2) మొదటి ప్రాకృత
శాసనం వర్ధమానుకోటలో లభించిన ఉపాసికాయ బుద్ధరక్షితాయ దాన శాసనం
3) మొదటి పద్య శాసనం
జినవల్లభుడి కుర్క్యాల శాసనం
4) మొదటి గద్య శాసనం
కొరవి శాసనంగా పేర్కొంటున్నారు.
5) తెలంగాణ శాసనాల్లో
భాష క్రమ పరిణామ దశలో అనేక మార్పులను పొందింది.
6) మొదట శాసనాల్లో
ప్రాకృత భాష ఉంది. అటు తర్వాత క్రమంగా శాసనాల్లో సంస్కృతం ప్రవేశించింది. ఎక్కువ
ప్రాకృతం, తక్కువ సంస్కృతం నుండి తక్కువ
ప్రాకృతం ఎక్కువ సంస్కృతం ఉన్న శాసనాలు వచ్చినవి. కాలక్రమంలో ప్రాకృతం పూర్తిగా
అదృశ్యమైంది. సంస్కృతం- కన్నడ, కన్నడ – సంస్కృతం, కన్నడ – తెలుగు, తెలుగు – కన్నడ, సంస్కృతం – తెలుగు, తెలుగు –
సంస్కృతం.. ఈవిధంగా శాసనాల్లో ఆయా రాజుల అధికార భాషానుగుణంగా భాష స్థిరపడింది.
కొన్ని మరాఠీ శాసనాలు, పర్షియన్, ఉర్దూశాసనాలు కూడా ఈ ప్రాంతంలో లభించినాయి.
తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పాశ్చాత్యులు, ఉత్తర భారతీయులు, ఆంధ్ర ప్రాంతంవారు, తెలంగాణ వారు శాసనాలను పరిశోధించి తద్వారా ఇక్కడి చరిత్రకు మహోపకారం
చేశారు.
================================================================
ప్రత్యేక జీవావరణ పరిస్థితులున్న దక్కన్‌లోని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం – జీవనదులతో, పర్వత పంక్తులు అరణ్య సంపదతో మొదటి నుండి జీవావాసమై, అనేక రాజవంశాల వలసలకు, పాలనకు కేంద్రమయింది. క్రీ.పూ. 6వ శతాబ్దిలో భారతదేశంలో ఏర్పడ్డ 16 జనపదాలతో దక్షిణ భారతదేశం మొత్తంలో ఉన్న ఒకే ఒక జనపదం – అస్సకా – మన
తెలంగాణ లోని కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలంటేనే తెలంగాణ
ప్రాశస్త్యం తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజ వంశాల వారు, అధికారులు తదితరులు వివిధ సందర్భాలలో అనేక శాసనాలు జారీచేశారు. ఈ
చారిత్రక శాసనాలు మన చరిత్ర రచనకు శ్వాసనాళాలు. ఈ శాసనాలలో ఎక్కువగా దాన శాసనాలే
కన్పిస్తాయి. క్రీ.పూ. 4వ శతాబ్ది నాటి కోటిలింగాల నాణెములపై
కన్పించే గోబధ, కంవాయస, నరన, మున్నగు పేర్లు కన్పిస్తాయి. ఇవి
శాతవాహనుల పూర్వకాలానికి చెందినవి.
వీటి తర్వాత క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి, నేటి జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల, దనాళికట్ట, మునులగుట్టలో కన్పించిన లఘుశాసనాలు మన ప్రాంతంలోని తొలి శాసనాలని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా బౌద్ధుల చైత్య, స్థూప విహారాలలో లభించినవే. వస్తుపరంగా యివి రాతిపై (శిలలపై) చెక్కినవి. దీన్ని శాసన పరిశోధకులు ”తొలిశిలాశాసన యుగం” అంటారు.
తర్వాత్తర్వాత
క్రీ.శ. 2,3 శతాబ్దాల నుండి రాళ్ళకి (శిలకి)
బదులుగా శాసనాలకి రాగి రేకులను (లోహపు రేకులు) వినియోగించారు. దీన్ని రాగిరేకుల
యుగమని లేక లోహరేకుల యుగమని అంటారు. వీటిని ఎక్కువగా బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం
చేసే సందర్భంలో యిచ్చేవారు. మల్లపల్లి వారి అభిప్రాయంలో ‘రాగిరేకుల శాసనం లభించిందంటే
అది బ్రాహ్మణులకిచ్చిన భూ దానమని చెప్పవచ్చు. ‘వైదిక, బ్రాహ్మణ మతంలోనే ఈ రాగి రేకుల జారీ అధికంగా కన్పిస్తుంది. క్రీ.శ. 7,8 శతాబ్దాల నుండి రాగి రేకులతోపాటు తిరిగి శిలాశాసనాలు జారీ కావడం పునః
ప్రారంభమైనది. ఇది కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలానికి ఉచ్ఛ స్థాయికి చేరింది. దీన్ని ”రెండవ శిలాశాసన
యుగం” అంటారు. లోహయుగంలో శిలా శాసనాలు లేవనికాదు. కానీ, తక్కువగా ఉన్నాయి. అట్లే శిలాశాసన యుగాలలో లోహశాసనాలు లేవని కాదు
కానీ తక్కువగా ఉండేవి. ఇక మనకు లభించిన వాటిలో కూడా శిలాశాసనాలే అధికము.
రాగిరేకులు తక్కువ. దీనికి కారణం చారిత్రక స్పహలేని వారు దొరికిన రాగిరేకులను
కరిగించివేయడమే ముఖ్య కారణము.
ఇక తెలంగాణలో శాసనాలిచ్చిన రాజ వంశాల విషయానికి వస్తే తెలుగువారిని
పాలించిన రాజవంశాలన్నీ (దాదాపు)గా తెలంగాణ ప్రాంతాన్ని పాలించాయి. కనుక ఈ రాజ
వంశాలు, వారి సామంతులు, అధికారులు,
ప్రముఖులు శాసనాలనుజారీ చేశారు. తెలుగు వారినందరినీ ఏకం చేసి పాలించిన రాజవంశాలలో శాతవాహనులు, విష్ణు కుండినులు, కాకతీయులు, కుతుబ్‌షాలు తెలంగాణా నుండి వచ్చినవారే. ఇక శాసన భాషల విషయానికి వస్తే ప్రాకృతం, సంస్కృతం, కన్నడము, తెలుగు, పార్శీ భాషలు తెలంగాణాలో శాసనాలలో కన్పిస్తాయి.
18వ శతాబ్దం నాటి ఏలేశ్వరం శాసనంలో యింగ్లీషు, ఫ్రెంచి భాషలు కన్పిస్తాయి. బ్రాహ్మీ, కన్నడ తెలుగు, తెలుగు దేవనాగరి, అరబ్బీ, మోడీ లిపులు శాసనలిపులుగా
కన్పిస్తాయి.
ఈ శాసనాలిచ్చిన రాజవంశాలలో శాతవాహనులు (కోటిలింగాల నాణెములు
శాతవాహనుల కంటే ముందువే), ఇక్ష్వాకులు, విష్ణు కుండి, బాదామి కళ్యాణి, వేములవాడ, ముదిగొండ చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు మసునూరు
వంశీయులు, రెడ్డి రాజులు (కొండవీడు వారి శాసనం
వాడపల్లిలో లభించింది). రేచర్ల పద్మనాయకులు, విజయనగర, కుతుబ్‌షా, అసఫ్ జాలు ప్రముఖులు – కుతుబ్‌షాల శాసనాలలో పార్శీ, తెలుగు ద్విభాషా శాసనాలు లభిస్తున్నాయి. వీరితో పాటు వీరి సామంతులయిన, ప్రాంతీయ పాలకులయిన రేచర్ల రెడ్డి, చెరకురెడ్డి వంశీయులు, విరియాల, మల్యాల వంశీయులు, మున్నగువారే గాక, ఉత్తర, పశ్చిమ దేశాల నుండి వచ్చిన కాయస్థులు, పరమార, యాదవ (వీరిలో అనేక ఉపశాఖలున్నాయి).
వంశీయుల శాసనాలు లభిస్తున్నాయి.
తెలంగాణలో శాసన పరిశోధన, శాస్త్రీయ పరిష్కరణ క్రీ.శ. 1882 నుండి జె.ఎ.ఫ్లీట్ హనుమకొండ వేయి స్థంభాల గుడి శాసనం చదివిన నాటి నుండి ఆరంభమైనదని చెప్పవచ్చు. ఫ్లీట్ అప్పట్లో భారత ప్రభుత్వ (ఆంగ్లేయుల అధికారంలోని) ప్రధాన శాసన పరిశోధకునికి సహాయకారిగా ఉండేవాడు. హైదరాబాద్ నిజాం నుండి ప్రత్యేక అనుమతి పొంది ఫ్లీట్ రుద్రదేవుని హనుమకొండ శాసనం చదివాడు. దీని ద్వారానే చరిత్రకారులకి తొలిసారిగా ”కాకతీయ వంశం” గురించి తెలిసింది.
తర్వాత వనపర్తి సంస్థానంలో ఆస్థాన పండితుడైన మానవల్లి రామకృష్ణ కవి మహబూబ్‌నగర్ జిల్లాలోని బూధ్‌పూర్, వర్థమానపురం శాసనాలను ప్రకటించారు. అట్లే వీరు వరంగల్ జిల్లాలోని శాసనాలు కొన్నింటిని పరిష్కరించారు. కవి తెలంగాణా శాసనములు అన్న గ్రంథాన్ని సంకల్పించారట కానీ, అలభ్యము.
అటు పిమ్మట శేషాద్రి రమణ కవులు 1915-20 మధ్య కాలంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అనేక ప్రాంతాలు తిరిగి, అనేక శాసనాలు సేకరించి, పరిష్కరించారు.
1914లో నిజాం
ప్రభుత్వం హైదరాబాద్‌లో పురావస్తుశాఖను ఏర్పరచింది. దీన్ని ‘ఆర్షశాఖ’గా
వ్యవహరించారు. దీనికి గులాంయాజ్దాని సంచాలకులుగా నియుక్తులయ్యారు. వీరి
సంచాలకత్వంలోనే తర్వాత కాలంలో పుట్టపర్తి శ్రీనివాసచారి, సంపాదకత్వంలో ‘కార్పస్ ఆఫ్ యిన్స్ క్రిప్షన్స్ ఆఫ్ తెలంగాణ’ పేర
శాసన సంపుటాలు వెలువడ్డాయి. వీటిలో మూడింటికి పుట్టపర్తివారు సంపాదకులుగా కాగా
నాల్గవదానికి మల్లంపల్లి సోమశేఖర శర్మ సంపాదకత్వం వహించారు.
మానవవల్లి రామకృష్ణ కవి హనుమకొండలోని సిద్ధేశ్వర గుట్టపైగల
శాసనాలను నకలు తీసుకొనేటపుడు కారణాంతరాల వల్ల కొంత భాగమే కాపీ చేసుకున్నారట.
తర్వాత మెకంజీ యొక్క పండితుడొకడు దీని పూర్తి పాఠాన్ని నకలు తీసికొని మద్రాస్
ప్రాచ్య లిఖిత భాండాగారములో భద్రపరిచారని తెల్సుకొని, మిగిలిన భాగాన్ని అక్కడికిపోయి రాసుకున్నారట. అంటే మెకంజీ దొర
కూడా తెలంగాణా శాసనాల సేకరణలో పాలుుపంచుకున్నాడన్నమాట. 1932లో వరంగల్‌లో కాకతీయ జయంత్యుత్సవాలు జరిగాయి. ఫలితంగా 1935లో ‘కాకతీయ సంచిక’ వెలువడ్డది. దీనిలో కాకతీయులనాటివి శాసనాలు
అనేకం ప్రచురించబడ్డాయి. మారేమండ రామారావు దీనికి సంపాదకులు. భావరాజు వెంటక
కృష్ణారావు, రాళ్ళబండి సుబ్బారావు, శేషాద్రి రమణ కవులు, ఆచార్య
సిరుగూరు హనుమంతరావు వంటి చరిత్ర, శాసన
పరిశోధకులు దీనిలో పాలుపంచుకున్నారు.
1)పైన పేర్కొన్న తెలంగాణాలో తొలి లిపి, శాసనాలు కోటలింగాల నాణెములపై కన్పిస్తాయి. అట్లే శాతవాహనుల తొలి
శాసనాలు కోటిలింగాల, ధూళికట్ట, మునులగుట్ట వద్ద లభిస్తున్నాయి. (ఈ మూడు ప్రాంతాలు నేటి జగిత్యాల
జిల్లాలలోనివే). కానీ వీటిని తెలుగువారి చారిత్రక గ్రంథాలలో యింకా పేర్కొనక దాడులు
చేస్తూనే ఉన్నారు.
2)ఇక్ష్వాకుల కాలంనాటి నాగార్జునకొండ, ఏలేశ్వరం, ఫణిగిరి శాసనాలు చారిత్రక ప్రాధాన్యత
ఉన్నవి. నాగార్జున కొండ త్రవ్వకాలలో లభించిన శతాధిక శాసన శకలాలలో నాలుగు శాసనాలు
అత్యంత ప్రాముఖ్యమైనవన్న విషయం అందరూ అంగీకరించాల్సిన విషయమే. మరొక శాసన శకలముపై
‘శక’ వంశానికి చెందిన బాలిక ప్రశంస ఉన్నది. ఉజ్జయిని కేంద్రంగా ఇక్ష్వాకుల
సమకాలీనులుగా పరిపాలన చేసిన వారు ఈ శకులు. ఈ ఉజ్జయినీ శకరాజ కుమార్తె రుద్రధర
భట్టారిక ఇక్ష్వాకు వీరపురుష దత్తుని భార్య. నాగార్జున కొండ శాసనాల ద్వారా
తెలంగాణా ప్రాంతానికి యితర ప్రాంతాలలో (సుదూర శ్రీలంకతో సహా) గల సంబంధ బాంధవ్యాలు
తెలుస్తాయి. అట్లే ఇక్ష్వాకు రాణీవాసపు ఘనత కూడా తెలుస్తుంది. ఫణిగిరిలో యిటీవల
బయల్పడిన రుళ పురుష దత్తుని 18వ రాజ్య సంవత్సరపు
శాసనం అత్యంత ప్రాముఖ్యమైనది. యిప్పటి వరకు రుళ పురుష దత్తుడు 12 సంవత్సరాలే రాజ్యం చేశాడని భావించారు. కానీ, ఈ శాసనం వల్ల ఇక్ష్వాకుల పాలనా కాలం మరొక ఆరు, ఏడు సంవత్సరాలు ముందుకు జరుగుతుంది. అలాగే ఈ శాసనంలో బుద్ధున్ని
‘కంసనిసూదన’ వంటి బిరుదులతో పేర్కొన్నారు. అంటే బుద్దుడు హైందవ దేవగణంలో కలిసే దశ
(కలిపేసే దశ) ఆరంభమైనదని చెప్పవచ్చు. అట్లే శాసనాలు ప్రాకృత భాష నుండి సంస్కృత
భాషలోకి మార్పు చెందడం ఈ శాసనం ద్వారా తెలుస్తుంది.
3)ఇక్ష్వాకుల తర్వాత యిక్కడ కన్పిస్తున్నవి విష్ణుకుండినుల శాసనాలు.
వీరి శాసనాలలో చరిత్ర గతిని మార్చినవి గోవింద వర్మ, విక్రమేంద్ర భట్టార వర్మల తుమ్మల గూడెం తామ్ర శాసనాలు
Comments
Post a Comment